Saturday, November 2, 2013

ఉద్యోగులకు సర్కారు తీపికబురు : హెల్త్ కార్డులు

ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆరోగ్య భద్రతకు సంబంధించి ఉద్యోగుల ఆరోగ్య పథకంకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పచ్చజెండా ఊపారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 

'ఉద్యోగుల ఆరోగ్య పథకం' (ఈహెచ్ఎస్)లో భాగంగా హెల్త్ కార్డులపై మార్గదర్శకాలు రూపొందిస్తూ ప్రభుత్వం 174, 175, 176 జీవోలు జారీ చేసింది. నాన్ గెజిటెడ్ ఉద్యోగుల నెలవారీ ప్రీమియం రూ.90గా నిర్ణయించింది. గెజిటెడ్ అధికారులు రూ.120 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్యానికిగురై ఆస్పత్రిలో చేరినప్పుడు... రూ.2 లక్షల వరకు ఎలాంటి డబ్బు చెల్లించకుండానే (క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్) పొందవచ్చు. 

ఈ పథకం పరిధిలోకి వచ్చే ఆస్పత్రులను ప్రత్యేకంగా గుర్తిస్తారు. చికిత్స వ్యయంపై రూ.2 లక్షల పరిమితి అనేది సాంకేతికమే. ఖర్చు అంతకంటే పెరిగినా... చికిత్స ఆగదు. ఉద్యోగి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వమే ఈ విషయం చూసుకుంటుంది. ఉద్యోగి జీవిత భాగస్వామి, సంతానంతోపాటు... తమపైనే ఆధారపడిన తల్లిదండ్రులు, అత్త మామలకు (డిపెండెంట్స్) కూడా ఈ పథకం వర్తిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

No comments:

Post a Comment